మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కే.ఏ.పాల్‌..వీడియో వైరల్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలన్ని ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్​ఎస్​లు ప్రత్యేకంగా భారీ బహిరంగ సభలు పెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లో పర్యటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలోనే, కేఏ పాల్ ఆదివారం మునుగోడు పరిధిలోని చౌటుప్పల్ లో పర్యటించారు.

ఆదివారం రాత్రివేళ తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్ వచ్చిన ఆయన స్థానిక మహిళలతో ఉత్సాహంగా బతకమ్మ ఆట ఆడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బతుకమ్మ ఆట ఆడుతున్న కేఏ పాల్ పై కొందరు నిటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్ర వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారు.