కేంద్రమంత్రి సింధియా కి సవాల్ విసిరిన కేటీఆర్

బిజెపి నేతలపై మరోసారి మండిపడ్డారు ఐటి, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్. ఎదుగు బొదుగు లేని రాష్ట్రాలకు చెందిన బిజెపి నేతల చిత్తశుద్ధిని నిజంగా మెచ్చుకోవాల్సిందే అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే పార్లమెంట్ ప్రవాస్ యోజన లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మూడు రోజులపాటు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడుతూ ట్వీట్ చేశారు.

సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ ఏ ఒక్క అంశంలో అయినా తెలంగాణ కంటే మెరుగ్గా ఉందో చూపించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సిందియాకు కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో 2.5% జనాభా కలిగి ఉన్న తెలంగాణ భారతదేశ జిడిపిలో ఐదు శాతం వాటాను అందిస్తోందని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక డబుల్ ఇంజన్ లా పనిచేస్తూ దేశ పురోగతికి పాటుపడుతున్నట్టు వివరించారు. ఏ అంశంలో మధ్యప్రదేశ్ తెలంగాణ కంటే మెరుగ్గా ఉందో చూపించాలని స్పష్టం చేశారు.