నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. కమలాపూర్‌లో రూ.45 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకులాలు, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్ని కేటీఆర్‌ ప్రారంభిస్తారు. తర్వాత జమ్మికుంటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

మంత్రి రాక నేపథ్యంలో కమలాపూర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాలు గులాబీమయమయ్యాయి. స్వాగత తోరణాలు, భారీ కటౌట్‌లతో హుజూరాబాద్‌ పరిసరాలన్నీ సందడిగా మారాయి. కేటీఆర్‌ రాక కోసం కమలాపూర్‌లో హెలీప్యాడ్‌ నిర్మించారు. పర్యటన నేపథ్యంలో కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొన్నారు.