హైదరాబాద్ మాదిరి కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీగా మారుతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి మాదిరి.. కరీంనగర్లోనూ తీగల వంతెన నిర్మాణం జరిగింది. కరీంనగర్ మీదుగా వరంగల్‌కు వెళ్లే వాహనాల రాకపోకలకు దూరాభారం తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యింది. రూ.224 కోట్ల వ్యయంతో నిర్మించిన తీగల వంతెనను రేపు సాయంత్రం ఐటీ పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
తీగల వంతెన 500 మీటర్లు.. కరీంనగర్ కమాన్ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో రహదారి పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3.4 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేసి అప్రోచ్ రోడ్లు నిర్మించారు. పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జి కారణంగా జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి దూరాభారం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆరు కోట్ల వ్యయంతో డిజిటల్ లైటింగ్‌తోపాటు రెండు పెద్ద తెరలను ఏర్పాటు చేశారు.