మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ను పెంచింది. గతంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం హైదరాబాద్ కు వచ్చిన మోదీని సీఎం కేసీఆర్ స్వాగతించలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరుపున స్వాగతించారు. అయితే ఆ సమయంలో ప్రధానిని స్వాగతించకపోవడంపై కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు.
తాజాగా మరోసారి రేపు ప్రధాని మోదీ హైదరాబాద్ రాబోతున్నారు. అయితే అదే రోజు కేసీఆర్ బెంగళూర్ వెళ్తున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడను రేపు కేసీఆర్ కలువనున్నారు. దీనిపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ చర్యలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ వస్తున్నారనే కేసీఆర్ రాష్ట్రం వదిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి సీఎం స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్ కాలరాసి నియంతలా వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్ర రైతులను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల రైతులకు డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు.