గోదావరి యాజమాన్య బోర్డు ఈ రోజు వర్ఛువల్ గా సమావేశం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయంపై నేటి సమావేశంలో గోదావరి యాజమాన్య బోర్డు చర్చించనుంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో ఈ వర్ఛువల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఇంజనీర్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో గోదావరి యాజమాన్య బోర్డు ఆధీనంలోకి ప్రాజెక్టులను తీసుకునే అంశం పై ప్రధానంగా చర్చిస్తారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కాళేశ్వర ప్రాజెక్టు లోని మేడిగడ్డ ఆనకట్ట, దేవాదుల ఎత్తిపోతల పథకం గోదావరి యాజమాన్య బోర్డు ఆధీనంలోకి తీసుకోవడానికి చర్చిస్తారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని సీలేరు తోపాటు మరి కొన్ని ప్రాజెక్టు లపై చర్చిస్తారు. ఈ సమావేశం అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో గోదావరి యాజమాన్య బోర్డు కిందకు వచ్చే ప్రాజెక్టులపై ఒక కొలిక్కి రానుంది. అలాగే ఈ నెల 26, 27 తేదీలలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జూరాల, ఆర్డీఎస్, సుకేశుల ప్రాజెక్టులను సందర్శించనుంది. ఈ ప్రాజెక్టుల నుంచి తగిన నీరు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బోర్డు పర్యటించనుంది.