‘స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ’.. కాంగ్రెస్​పై కేటీఆర్ ఫైర్

-

స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేస్తారని… కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ స్పందించారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. పరిపాలన చేతగాని..చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలుస్తాయని… పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ అని విమర్శించారు. బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోతాయని… విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అని చెప్పారు.

థర్డ్ గ్రేడ్ నాలాయక్స్​ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోతాయని… ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో కలవడం గ్యారెంటీ అన్నారు. జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలుస్తుందని తెలిపారు. దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు తెలంగాణ అని… ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు తెలంగాణ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కల్లబొల్లి గ్యారెంటీలు రాష్ట్రంలో చెల్లవన్న మంత్రి…  రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అన్నారు. కాలకేయుల కాలమొస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అని… మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతేనని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version