కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి తేడా లేదని.. ఈ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. గురువారం మహాజన్ సంపర్క్ అభియాన్.. ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని.. ఇప్పుడు మళ్లీ గెలిపించినా బిఆర్ఎస్ పార్టీలోనే చేరతారని అన్నారు. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు.
తెలంగాణలో వచ్చేది కూడా బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్నారు. అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఓ కుటుంబం పాలైందని అన్నారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కుటుంబం వేలకోట్ల ప్రజల డబ్బును దోచుకుని మళ్ళీ ఏలాలనుకుంటుందన్నారు. రాష్ట్రం కోసం అమరులైన 1200 మంది వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.