పార్టీ మారతానని ప్రచారం చేస్తే లీగల్‌ నోటీసులు ఇస్తా: వెంకట్‌రెడ్డి

-

తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్‌ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. దిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తదితర అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కోమటిరెడ్డి బ్రాండ్‌ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పనిచేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు.

ఇటీవలే ‘మీరు’ వెన్నుపోటు పొడిచారు అన్న రేవంత్ మాటలపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి శత్రువులతో కలిసి వెన్నుపోటు పొడిచారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. సోదరుడు రాజగోపాల్‌రెడ్డితో తనను కలిపి.. ఇద్దరికీ ఆ వ్యాఖ్యలు వర్తించేలా ‘మీరు’ అని అన్నందుకు క్షమాపణలు చెప్పాలని బుధవారం పేర్కొన్నారు. సోదరుడి పార్టీ ఫిరాయింపు గురించి అడగ్గా… రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి ఎందుకు వెళ్తున్నారన్నది ఆయన్నే అడగాలని అన్నారు. తాను కాంగ్రెస్‌ కార్యకర్తనని, పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పనిచేస్తానని తెలిపారు.

తమది ఉమ్మడి కుటుంబమని, ప్రస్తుత పరిణామాలను వ్యూహ కమిటీ చూసుకుంటుందన్నారు. తమ్ముడితోపాటు అన్న కూడా పార్టీ ఫిరాయిస్తారన్నది మీడియాకున్న అనుమానం తప్పితే దానిపై తాను స్పందించడానికేమీ లేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ కరుడుగట్టిన కార్యకర్తను పట్టుకొని పార్టీ ఫిరాయిస్తారా? అని అడగడం తప్పని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత రేవంత్‌రెడ్డి ‘మీరు’ అంటూ ఇద్దర్నీ ఒకే గాటనకట్టి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం తప్పన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనాలి తప్పితే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అని అర్థం వచ్చేలా అన్నారని ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news