కేసీఆర్ ను సీఎం జగన్ కలవడంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసే వరకు ఏ విషయాన్ని చెప్పటం లేదని… ఈ విషయాన్ని ముందే తెలుసుకొమ్మని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగన్ మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుస్తామని ఆశించిన కేసీఆర్ గారిని కేవలం ప్రజలను కలవకుండా అహంకారంతో వ్యవహరిస్తున్నారన్న కారణంగానే ప్రజలు ఓడించారని పేర్కొన్నారు.
తెలంగాణ సాధించడమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టినా, అహంకారంతో మసులుకున్నారనే కారణంగానే ప్రజలు ఆయన్ని ఓడించారని అన్నారు. తాజా మాజీ సీఎం, కాబోయే మాజీ సీఎంకు ఏం చెప్పారోనని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు కనిపించాయని, కేసీఆర్ గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మూడు వారాలు గడిచిన తర్వాత ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానంలో జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదు చేరుకొని ఆయన్ని పరామర్శించారని, తల్లిని కలవడానికి హైదరాబాదుకు వచ్చారా?, హైదరాబాదుకు వచ్చినందుకు తల్లిని కలిసారా అన్నది ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి గారిలో మాత్రం అలజడి మొదలయ్యిందని అన్నారు.