ఎన్నికల్లో డబ్బుల సంచులు మోసుకెళ్లడమే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పని: ఉత్తమ్‌

-

రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు జరిగిన డబ్బుల సంచులు మోసుకెళ్లడమే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పని అని.. అతను ఎమ్మెల్సీగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులకు ఏం చేశాడో తెలుపాలని ఎంపీ ఉత్తమ్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో డబ్బులు పంచే బాధ్యత పల్లా రాజేశ్వర్‌ రెడ్డిదేనని ఉత్తమ్‌ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో నిర్వహించిన వరంగల్‌ అర్బన్‌ గ్రామీణ జిల్లా కార్యకర్తల సమావేశానికి ఉత్తమ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

హామీలు విస్మరించిన కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం అది తెచ్చింది.. ఇది తెచ్చింది అని ప్రగల్బాలు పలికే బీజేపీ నాయకులు.. ఏపీ విభజన చట్టంలో పొందుబర్చిన విధంగా కేంద్రం, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్, కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడాని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. కేవలం పథకాలు, ప్రాజెక్ట్‌ల పేర్లతోనే దేశ ప్రజలను మభ్యపెట్టి గెలుస్తున్నారని వారికి ఎలాంటి లబ్ధి చేరడం లేదన్నారు. దీన్ని ప్రజలంతా గ్రహించారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు.

టీఆర్‌ఎస్‌ ఓడితే 43 శాతం ఫీట్‌మెంట్‌..

రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న 1.90 లక్షలు ఉద్యోగాలు వెంటనే భర్తీ కావాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ ప్రస్తుతం 7.5 శాతం ఉందని టీఆర్‌ఎస్‌ ఓడిపోతే 43 శాతం వస్తుందని పేర్కొన్నారు. ఇదంతా గ్రహించి రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఉత్తుతి హామీలిచ్చే పార్టీలని కేవలం ఎన్నికల సమయమప్పుడే ప్రజల్లోకి వెళ్తారని ఆ తర్వాత ఇటువైపు కన్నెతి చూడరని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news