హైదరాబాద్​ను ముంచెత్తిన మూసీ

-

భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తింది. ఉగ్రరూపం దాల్చి నగరంపై ముప్పేట దాడి చేసింది. పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను మూసీ జలాలు ముంచేశాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధి, వికారాబాద్‌, అనంతగిరి కొండల్లో భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ రెండింటిలోకి బుధవారం సాయంత్రానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చిన దాన్ని వచ్చినట్లు అధికారులు దిగువకు విడిచి పెడుతున్నారు.


ఉస్మాన్‌సాగర్‌లోకి రికార్డు స్థాయిలో వరద చేరింది. దాదాపు దశాబ్దం తర్వాత 15 గేట్లలో 13 గేట్లను ఆరడుగుల మేర ఎత్తడం గమనార్హం. 2020 అక్టోబరు నాటి వరదల్లో హిమాయత్‌సాగర్‌లోకే భారీగా వరద చేరడంతో మూసీలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లో 17 గేట్లకు…8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి జలాలను కిందికి విడిచిపెడుతున్నారు.

మరోవైపు భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.

నగరంలో మూసీ ఉగ్రత ధాటికి చాదర్‌ఘాట్‌ నుంచి మూసారంబాగ్‌ వరకు నది పక్క బస్తీలలో పెద్దఎత్తున ఇళ్లు నీట మునిగాయి. 3వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఉదయం 3-4 అడుగుల ఎత్తున సాగిన ప్రవాహం సాయంత్రానికి కాస్త నెమ్మదించింది. చాదర్‌ఘాట్‌ కాజ్‌వేను తాకుతూ వరద పారింది. మూసారంబాగ్‌ వంతెనపై వరద ఉద్ధృతికి రెండువైపులా నిర్మించిన రక్షణ కంచె కొట్టుకుపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news