తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు కావడంతో పోలీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేపడుతున్నారు. నిన్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు వాహనాన్ని తనిఖీ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్నారు.
ఈ క్రమంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.