ఆవు పేడతో ఇటుకలు చేస్తున్న ప్రొఫెసర్‌.. వాటెన్‌ ఐడియా సర్జీ..!

పల్లెటూర్లలో పిడకలు వేయడం మనం చూసే ఉంటాం.. ఎక్కడ గోడలకు చూసినా పిడకలే ఉంటాయి.. అయితే వాటిని పొయ్యిలో పెట్టుకోవడానికి తయారుచేస్తారు.. అలాంటి పిడకలతో ఇటుకలు చేశాడు హర్యానాకి చెందిన ప్రొఫెసర్‌ శివదర్శన్‌ మాలిక్.. పిడకలు వేసిన గోడల ఇంటిలోపల చల్లగా ఉండటం గమనించిన ఆయనా… అలాంటి పిడకలతో ఇటుకలు చేసి ఇళ్లు కడితే..ఇండియా లాంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఏసీలతో అంత అవసరం ఉండదు కదా అనుకున్నాడట.. మన దగ్గర ఎండలు ఎక్కువగా ఉన్నా…అందరి ఇళ్లలో ఏసీలు ఉండవు.. వాటిని భరించలేరు కాబట్టి.. ఇంతకీ ఆవుపేడతో ఇటుకలు ఎలా చేశాడో చూద్దామా..!!
శివదర్శన్ తయారుచేస్తున్న ఇటుకలు ప్రకృతికి హాని చెయ్యవు. వాటిలో పేడతోపాటూ.. మరికొన్ని పదార్థాలు కలిపి చేస్తున్నారు. ఈ ఇటుకలు, పొడి వల్ల.. ఇళ్లలో వేడి 7 డిగ్రీలు తగ్గుతోందని తెలిసింది. సాధారణంగా.. ఇళ్ల నిర్మాణంలో వాడే కాంక్రీట్.. వేడిని పెంచుతుంది. శివదర్శన్ ఇటుకల వల్ల కాంక్రీట్ వాడకం బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఇళ్లలో వేడి తగ్గుతుంది. కాంక్రీట్ వల్ల పర్యావరణానికి హాని కూడా జరుగుతుంది..
ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ని నార్వేలో మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హెమ్ పోస్ట్ చేశారు. ఆవు పేడ, వేపతో తయారు చేసే ప్లాస్టర్ వల్ల ప్రొఫెసర్ ఏడాదికి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ ట్వీట్‌ని నవంబర్ 22న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ 3.72 లక్షల మందికి పైగా చూశారు. 12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ది బెటర్ ఇండియా చేసిన ఇంటర్వ్యూలో శివదర్శన్ తన వేదిక్ ప్లాస్టర్ గురించి తెలిపారు, దాన్ని పేడ, మట్టి ఇతర సహజ పదార్థాలతో తయారు చేసినట్లు వివరించారు. ఈ ప్లాస్టర్.. బయటి నుంచి వచ్చే వేడిని ఇళ్లలోకి రానివ్వదని తెలిపారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకూ, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకూ ఇది మేలు చేస్తుందట..
శివదర్శన్.. గోక్రీచ్ బ్రిక్స్ పేరుతో.. పేడతో ఇటుకలు తయారుచేస్తున్నారు. ఈ ఇటుకలు 70 శాతం వేడిని ఇళ్లలోకి రాకుండా ఆపుతాయని ఆయన చెబుతున్నారు. వీటిని సాధారణ ఇటుకల కంటే 7 రెట్లు తక్కువ ధరకే అమ్ముతారట.. నిజంగా ఇది ఇన్నోవేటివ్ ఐడియానే.