తెలంగాణ రాష్ట్రంలో తన రచనలతో, కవిత్వాలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ రావు (63) కన్ను మూశారు. హైదరాబాద్ లోని దోమల్ గూడ్ లో గల తన నివాసంలో శుక్రవారం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గుండె పోటుకు గురి అయ్యారు. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. చదువు అనంతరం మొదటి సారి సికింద్రబాద్ లోని వెస్లీ బాలుర పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో ఆచార్యుడిగా పని చేశారు.
ఈ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రచురించే సాహితీ పత్రికకు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సంపాదకుడిగా సేవలందించారు. దీని తర్వాత 2019 లో హెచ్ సీయూ లో తెలుగు విభాగంలో ఆచార్యుడిగా పని చేశారు. అనంతరం లిటరరీ ఛైర్ డీన్ గా వ్యవహరించారు. తెలుగుఆకాడమీ, తెలుగు సలహా మండిలి తో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడి గానూ పని చేశారు. కాగ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ హిందీ, ఉర్ధూ లో ఉన్న కవితలను తెలుగు లో అనువదించారు. కొత్త గబ్బిలం, మల్లె మొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి, నా అక్షరమే నా ఆయుధం, అటజనిగాంచె, తొలి వెన్నెల వంటి ఎన్నో పుస్తకాలను రచించారు.