ఆంధ్రావని రాజకీయాల్లో ఇద్దరే ఇద్దరు లబ్ధ ప్రతిష్టులుగా నిలిచి ఉన్నారు. వారే చంద్రబాబు మరియు జగన్. నందమూరి ఇంటి పెద్దగా ఉన్న చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ పేరును కొత్తగా ప్రతిపాదించిన కృష్ణా జిల్లా (విజయవాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యే జిల్లా) సూచించడాన్ని ఇన్నాళ్లకు స్వాగతించారు.ఇదే సమయంలో ఆయన ఫైర్ అయ్యారు.ఫ్లవర్ ఎందుకు ఫైర్ ఎందుకో చూద్దాం.పూలు కొన్నే ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో పసుపు పూలకు అస్సలు లోటే లేదు.
కొన్ని అరవిచ్చినవి. .కొన్ని వికాసం లేనివి.. కొన్ని వాడినవి.. అయినా కూడా తెలుగుదేశం పార్టీలో కొన్ని ముళ్లు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే పార్టీ పరంగా వాటి గుర్తింపు వాటికి ఉండదు. అదేవిధంగా పార్టీకి ఆ నాయకులు ఉపయోగపడేంత సీన్ ఉండదు. కొన్ని ప్రెస్మీట్లకు హాజరై అవతలి పార్టీకి సాయం చేసే ముళ్లు చాలా ఉన్నాయి. వీటి కారణంగా వైసీపీకి బలం పెరుగుతోంది. వీటి కారణంగానే వైసీపీకి ఆధిక్యం కూడా పెరుగుతోంది. కనుక పసుపు పూల తోటలో ఫైర్ కొందరే! గడ్డి పువ్వులు వాడిపోయిన పువ్వులు కలిపి ఆ తోటలో అలానే పడి ఉన్నాయి.
మంచులో అలానే తడిసి ఉన్నాయి. కొన్ని పరిణామాలకు అవి జడిసి ఉన్నాయి కూడా! మరి! పార్టీ లో కాస్తో కూస్తో ఫైర్ అనిపించుకున్న నేతలు అరుదుగానే ఉన్నారు. కేసులకు జడిసి మొన్నటి వరకూ ఫైర్ అయిన నేతలూ ఉన్నారు ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయి ఉన్నారు. అధినేత అప్పుడప్పుడు మాత్రమే ఫైర్ తరువాత ఆయన కూడా కూల్ అయిపోయి పెద్దగా మాట్లాడని రోజులు, ఏం మాట్లాడాలో తెలియక తికమక పడిన రోజులు అనేకం.
ఇక వైసీపీ అధికారంలో ఉంది. అంటే ఫైర్ లో ఉంది. నిప్పు కారణంగా రాజుకుంటున్న పొగ కారణంగా చాలా మంది బాగానే ఉన్నారు. ఉన్నామని అనుకుంటున్నారు. అప్పుడుప్పుడు మంత్రులు ఫైర్ అవుతున్నారు. కానీ ఆ ఫైర్ అన్నది విపక్షానికి యూజ్ అవుతుంది కానీ ప్రజలకు, పార్టీకి ఆ నిప్పు కారణంగా ఎటువంటి ఫలితం ఉండదు ఉత్త బూడిద తప్ప! ఓ విధంగా జగన్ ఫైర్ అవుతున్నారు కానీ ఫైర్ బ్రాండ్ రాజకీయం మాత్రం నడపలేకపోతున్నారు అన్నది ఓ ప్రధాన విమర్శ.
సజ్జల లాంటి వారు కూడా అప్పుడప్పుడు క్యాంప్ ఫైర్ రాజకీయాలు మాత్రం నడిపి ఆగిపోతున్నారు. కానీ వాళ్ల స్థాయి కూడా ఇంకా పూర్తిగా పార్టీలో స్థిరం కాలేదు. ఆ విధంగా కొందరు నాయకులు సజ్జల అనే ఓ ప్రభుత్వ సలహాదారుడిపై ఫైర్ అవుతున్నారు. ఆ నెల జీతగాడిపై ఫైర్ అవుతున్నారు. ఆ మాజీ జర్నలిస్టుపై ఫైర్ అవుతున్నారు.ఈ విధంగా జగన్ ఇలాకాలో కొంత ఫైర్ ఉన్నా సరిపోదు. భగ భగ మండే నిప్పు కణికల మాదిరిగా విజృంభించే రాజకీయం జగన్ చేయలేకపోతున్నారు అన్నది ఓ ప్రాధాన్య రీతికి తూగే విమర్శ.
ఇప్పటికి దేశ రాజకీయాల్లో ఆయన స్థానం అప్రాధాన్యం అయితే కాదు.
– రత్నకిశోర్ శంభుమహంతి, మన లోకం ప్రత్యేకం