నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌.. కోర్టు ఓకే అంటే అరెస్టే..!

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా.. వీటిపై విచారణ నిమిత్తం అతడిని అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌ ఏ2గా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, డెక్కన్‌ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని ఓ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజ్‌కు ఇచ్చి డబ్బులు తీసుకున్నారని నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. నందకుమార్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

ఆయన ఇప్పటికే రిమాండ్‌ ఖైదీగా ఉన్నందున పీటీ వారెంట్‌కు అనుమతివ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టును కోరారు. రెండు వేర్వేరు కేసుల్లో నందకుమార్‌ నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని వారెంట్‌లో ప్రస్తావించారు. ఒక ఫిర్యాదుదారు నుంచి దాదాపు రూ.70లక్షలు, మరొకరి నుంచి దాదాపు రూ.2లక్షల వరకు అద్దె తీసుకుని మోసం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పీటీ వారెంట్‌ జారీ చేయాలని పోలీసులు కోరారు.

పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతిస్తే రిమాండ్‌లో ఉన్న నందకుమార్‌ను అరెస్టు చేసి ఈ కేసులో భాగంగా ఆయనను రిమాండ్‌ చేసే అవకాశం ఉంది. అయితే, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించిన తీర్పు కూడా ఈరోజే ఏసీబీ ప్రత్యేక కోర్టు వెలువరించనుంది. ఒకవేళ బెయిల్‌ మంజూరైతే నందకుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు బెయిల్‌ తిరస్కరిస్తే యథావిధిగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news