ప్రభుత్వాన్ని కూలదోసేందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా – తమ్మినేని

తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. అందుకే మునుగోడు ఎన్నికలలో కేంద్రం కుట్రలు బయటపడ్డాయని అన్నారు. అభివృద్ధి అనే కుంటి సాకుతో ఆయన రాజీనామా చేశారని దుయ్యబట్టారు. మతతత్వ బిజెపి పార్టీని తెలంగాణలోకి ఎట్టి పరిస్థితులలోనూ రానివ్వమని హెచ్చరించారు.

ఇక వచ్చే శాసనసభ ఎన్నికలలోను టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టడమే తన ఐడియాలజీ అని అన్నారు. బిజెపి నేతలు స్వామీజీ పేరుతో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించడం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. తెలంగాణలో మత రాజకీయాలకు తావు లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో సిపిఎం బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, తదితర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు తమ్మినేని వీరభద్రం.