ఖమ్మం జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే కాంగ్రెస్ సభ దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ.. వాటిని పీఎస్లకు తరలిస్తున్నారు. సభకు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారంటున్న కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వందల కొద్దీ వాహనాలను అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు కూడా మండిపడుతున్నారు. ఖమ్మం సభ అంటే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని.. ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత అని విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.