దళితులకిచ్చిన హామీలేమయ్యాయి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రశ్న

-

ఎన్నికల్లో కేసీఆర్‌ దళితులకు ఇచ్చిన ఇతర హామీలన్నీ ఎక్కడికి పోయాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో ఆదివారం నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దళిత, గిరిజనులపై దాడి చేసే ధైర్యం ఆ పార్టీ నేతలకు కేసీఆర్‌తోనే వచ్చిందని పేర్కొన్నారు.

‘మరి కొద్ది నెలల్లో ఓట్ల కోసం వారి ఇళ్లకే వెళ్తావు. అప్పుడు వారే చూసుకుంటారు’ అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది దళిత, గిరిజనులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్‌ దళితుణ్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

‘‘ఈ ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో దళితుల, గిరిజనుల ఆత్మగౌరవం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి. భూస్వాములకు brs, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంటే.. దళిత, గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంది. పాలమూరు దళిత బిడ్డ అయిన ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ గొంతు మీద కత్తిపెట్టి బయటకు పంపిస్తే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి తన పౌరుషాన్ని చూపిస్తున్నారు. ఆకునూరి మురళి వంటి దళిత అధికారులను అవమానించారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో దాడికి గురైన వాల్యానాయక్‌, రాములకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news