వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపి వేయడం ఖాయం అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 89వ రోజు కొనసాగుతోంది. నేడు గుర్రంపోడు మండలం చేవూరు క్రాస్ రోడ్ నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. గుర్రంపోడు మండల కేంద్రంలోని కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
డబుల్ బెడ్ రూమ్ ఇంటికి రూ. ఐదు లక్షల ఇవ్వడంతో పాటు రేషన్ దుకాణాలలో 9 రకాల నిత్యవసరాలను అందిస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కనిపించే అభివృద్ధి అంతా జానారెడ్డి హయాంలోనే జరిగిందని, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు భట్టి. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందకుండా.. కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు.