ఎన్నికల నియమ, నిబంధనలను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించే పద్ధతులను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వివరించారు. ప్రధానంగా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్.. భరత్ కుమార్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు.. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి. ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవాళ సీఎం కేసీఆర్ స్పెషల్ గా క్లాస్ తీసుకున్నారు. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం 51 బీఫామ్‌లు సిద్ధం అయ్యాయి.. మిగతా బీఫామ్‌లు రెడీ అవుతున్నాయి.. మిగతా వారికి రెండు రోజుల్లో బీఫామ్‌లు అందుతాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు.. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. ప్రతీది తెలుసుకోవాలి. మాకే అంతా తెలుసు అనుకోవద్దు. అఫిడవిట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే గద్వాలలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి తప్పిదాల వల్ల గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే పదవీ కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత అభ్యర్థులదే అన్నారు. అలకలను పక్కన పెట్టి గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్లనే వేములవాడలో సీటు మార్చాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.