కరోనా అనంతరం మొదటిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు అన్నివిధాలా సహకారం అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ సమావేశమై 25వ తేదీన జరగనున్న క్రికెట్ మ్యాచ్‌పై చర్చించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు అవసరమైన భద్రతతోపాటు ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అజారుద్దీన్ మంత్రికి విన్నవించారు.
స్పందించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అవసరమైన మేరకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేంద్రరెడ్డికి ఫోన్ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా జీహెచ్ఎంసీ, ఎస్పీడీసీఎల్, ఫైర్ సర్వీసు, మెడికల్ తదితర శాఖల అధికారులతో కూడా మాట్లాడిన మంత్రి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్‌ను వీక్షించేందుకు దేశ, విదేశాలకు చెందిన క్రికెట్ ప్రేక్షకులు నగరానికి వస్తున్నందున హైదరాబాద్ నగర ప్రతిష్ఠను పెంచేట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.