అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అకాల వర్షాల వల్ల ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు లేఖలో వివరించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతే ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సమగ్ర పంట బీమా పథకాన్ని రూపొందించకపోవడం బాధాకరం అన్నారు.
పథకం రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఏళ్ల తరబడి అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా పంట నష్టపోయిన రైతులందరికీ యుద్ధ ప్రాతిపదికన పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేసి ఉంటే.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేదని అన్నారు. కానీ బిజెపికి పేరు వస్తుందనే అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు.