రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నిఖిల వెల్లడించారు. మంగళవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ నిఖిల సమావేశమయ్యారు.
వికారాబాద్ పట్టణ పరిసరాల్లో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులెవరూ సెలవుల్లో వెళ్లకూడదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన సభ్యులు డాక్టర్ ఆనంద్, యాదయ్య, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.
ఇప్పటికే ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.