రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఆయన చేష్టలు, వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించి మరోసారి చర్చనీయాంశమయ్యారు. శ్రీనివాస రావు వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా డీహెచ్ అక్కడి ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి.
పాల్వంచ మండలంలో పర్యటనలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావుపై డీహెచ్ శ్రీనివాస్ రావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇదే చివరి పోటీ అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తన సమావేశానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారని.. ఇలాంటి తీరుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా… అని కార్యక్రమానికి వచ్చిన వారిని శ్రీనివాస్ రావు ప్రశ్నించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.