వైభవంగా పది రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

-

తెలంగాణ రాష్ట్రం అవతరించి ఈ ఏడాదితో పదేళ్లవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. మరి కొద్దిరోజుల్లో పదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే జూన్‌ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసింది. ముఖ్యంగా దేశానికి తెలంగాణ మోడల్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాల అవసరం ఉందనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, మండల స్థాయుల్లోనూ దశాబ్ది వేడుకల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద సమీక్ష  జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మార్గనిర్దేశం, ఆదేశాలు, సూచనల మేరకు తుది కార్యాచరణను రూపొందించనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news