హైదరాబాద్‌లో ఇటీవల ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక పోలీసుల సాయంతో కేంద్ర నిఘా సంస్థ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిజ్బ్ ఉత్ తహరీర్(హెచ్‌యూటీ) ఉగ్ర సంస్థ సభ్యుల వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
నిందితులు భారీ ఎత్తున పేలుళ్లకు పథక రచన చేశారని, ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు గుర్తించారు. తొలి దశలో యువతని ఆకర్షించి తమవైపు తిప్పుకొంటారు. రెండో దశలో వారికి సాంకేతికత, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడులు చేయిస్తారు. మొత్తంగా మూకుమ్మడి దాడులతో భయానక పరిస్థితిని సృష్టించేందుకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసేందుకు వారు వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.