మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని సర్వే నం.130లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న మూడెకరాల భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారంటూ తహసీల్దార్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ జమునా హేచరీస్, దాని తరఫున నితిన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై మంగళవారం జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది హరేందర్ పరిషద్ తెలిపారు. వివాదాస్పద భూమిని పేదలకు కేటాయించామని, వారిని ప్రతివాదులుగా చేర్చకపోవడం సరికాదన్నారు.