తెలంగాణ విద్యార్థులకు అలర్ట్…ఈ నెలాఖరులోగా ఎంసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో JNTUH నిర్వహించిన ప్రవేశపరీక్ష నిన్నటితో ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి 3,01,789 మంది హాజరయ్యారు. నిన్న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ ప్రాథమిక కీని విడుదల చేయగా, నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ కీని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెలాఖరులోగా ఫలితాలను కూడా విడుదల చేస్తామన్నారు. ఈ సారి ఇంటర్ వెయిటేజీని తొలగించారు. కాగా, ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 3,100 వరకు అఫీలియేషన్ దరఖాస్తులు రాగా నిన్నటి వరకు 1,498 కళాశాలలనే బోర్డు వెబ్ సైట్ లో ఉంచారని సమాచారం. 1,500 ప్రైవేట్ కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 322 కళాశాలలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కాగా, అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలలోనే చేరాలని ఇంటర్ బోర్డు సూచించింది.