తెలంగాణలో వరణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలలతో కూడిన వడగండ్లు రాష్ట్ర రైతులకు కడగండ్లు మిగిల్చాయి. ఏకధాటిగా కురిసిన వానకు రాష్ట్రం అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల మేర కుండపోతగా కురిసిన అకాల వర్షం కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది.
రాంచంద్రాపురం-7.98, గచ్చిబౌలి-7.75, గాజులరామారం-6.5, కుత్బుల్లాపూర్-5.55, జీడిమెట్లలో 5.33 సెం.మీ వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ పరిధిలోనూ దాదాపు అదే మోతాదులో వర్షం కురిసింది. వర్షంతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచిన గాలులు నగరవాసులను వణికించాయి.
గాలుల వేగానికి హైదరాబాద్‌లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు., హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటలపాటు నగరంలోని అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. ఇక ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు వర్షంలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ఇళ్లకు చేరుకునే వరకు అర్ధరాత్రి అయింది.