తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించనున్నారు. 2023 జనవరి ఒకటో తేదీ అర్హత తేదీతో.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తు ఇవాళ్టితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ.. ఓటు హక్కు ఉండాలన్న భావనతో ఈసీ ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతోంది. అందులో భాగంగా ఇంటింటి సర్వే, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కసరత్తు పూర్తి చేసి 2022 నవంబర్ తొమ్మిదో తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించింది.
2022లో ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య మూడు కోట్లా మూడు లక్షలకుపైగా ఉంది. రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం కొత్త జాబితానే కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. తుది జాబితా ప్రకటించాక కూడా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.