నైరుతి రుతుపవనాల పలకరింపుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. మొన్నటి దాకా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలు ఇప్పుడు కాస్త చల్లబడటంతో ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోనూ వర్షాలు షురూ అయ్యాయి. అయితే మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
హైదరాబాద్‌లో తేలిక పాటి వర్షాలుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.