తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. మే నెలలో ఇవి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.
రాష్ట్రంలో హనుమకొండ, కర్నూలు, ఆదిలాబాద్, మెదక్, రామగుండంలలో గరిష్ఠంగా 42.5-43.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రి వేళల్లోనూ వేడి సెగలు ఇబ్బంది పెడుతున్నాయి. పగటిపూట ఇంట్లో ఉన్నా వేడి గాలుల ప్రభావం ఉంటోంది.
ఓవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత వల్ల రాష్ట్ర ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముందని వైద్య నిపుణలు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వేసవిలో వీలైనంత ఎక్కువగా మంచినీరు, పండ్ల రసాలు తాగాలని సూచిస్తున్నారు.