ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం బాధాకరం – విజయశాంతి

-

ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం పై స్పందించారు బిజెపి నేత విజయశాంతి. కెసిఆర్ సర్కారు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు ఇంతవరకు వచ్చాయని అన్నారు. పరిస్థితులు మరింత విషమించక ముందే తెలంగాణ సర్కారు మేల్కొంటే రాష్ట్రానికి మంచిదన్నారు విజయశాంతి.

“ఖమ్మం జిల్లా చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం ఎంతో బాధాకరం. పోడు భూముల వ్యవహారంతో ముడిపడిన ఈ దురదృష్టకర సంఘటన అనంతరం శ్రీనివాసరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించడం గురించి అలా ఉంచితే…. అసలు కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం, తాత్సార ధోరణి వల్లే పరిస్థితులు ఇంతవరకూ వచ్చాయి. పోడు భూముల సమస్య ఏళ్ళ తరబడి రగులుతూనే ఉన్నా తెలంగాణ సర్కారు మాత్రం హామీలతో కాలం గడిపేస్తూ వచ్చింది.

మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న పోడు భూములు, అడవుల రక్షణ విధులు నిర్వర్తించే ఫారెస్ట్ అధికారులపై దాడులు జరుగుతుంటే పాలకుల నుంచి దిద్దుబాటు చర్యలేమీ లేవు. పోడు భూముల్లో హరితహారం సహా ఈ విషయంలో ప్రభుత్వం నుంచి విధానపరమైన నిర్ణయాలు లేకపోవడం అటు పోడు భూముల సాగుదారులకు, ఇటు అటవీ అధికారులకు సమస్యగా మారింది. పరిస్థితులు మరింతగా విషమించక ముందే తెలంగాణ సర్కారు మేలుకుంటే రాష్ట్రానికి మంచిది” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news