గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. 2018లో ప్రారంభమైన ఈ ఉద్యమం నాటి నుంచి నేటి వరకూ ఎంతోమంది ఒకరికి ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ మొక్కలు నాటుతూ వస్తున్నారు. నటీనటులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు. సామాన్యలు అని తేడా లేకుండా అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ అద్భుత సృష్టికి ఐదేళ్లు వచ్చాయి. ఈ 5 ఏళ్లలో ప్రజా ఉద్యమంగా మారి కొన్ని వేల ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది.
ఫారెస్ట్ బ్లాకులను ప్రముఖులు దత్తత తీసుకుంటున్నారు. తెలంగాణలో దాదాపు 80కి పైగా ఫారెస్ట్ క్లస్టర్లు ఉన్నాయి, కనీసం 200 ఎకరాలు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (45) 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించినప్పుడు, అది ఇంత ప్రాచుర్యం పొందుతుందని అనుకోలేదట.. ఒక వ్యక్తి ఒక మొక్కను లేదా ఒక చెట్టును నాటడంతో పాటు మరో ముగ్గురిని కూడా అలాగే చేయమని ఛాలెంజ్ విసురుతారు.. మొక్కలు నాటే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇలా అది స్టాలిన్ సినిమాలోలా ఇంతై ఇంతింతై వ్యాపిస్తూ వచ్చింది.
ఈ విజయం పై ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంతలా విజయం సాధిస్తుందని అనుకోలేదు. పర్యావరణానికి నా వంతు కృషి చేశాను.. ప్రజలంతా ఎమోషన్‌ల్‌గా కనక్ట్ అయ్యారు. అందరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
సీఎం నుంచి పీఎం వరకూ అందరూ భాగస్వామ్యులే..
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రచారంలో పాల్గొన్నారు. వారిలో కొందరు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సద్గురు జగ్గీ వాసుదేవ్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, కపిల్ దేవ్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్, పుల్లెల గోపీచంద్, మహేష్ బాబు. ప్రభాస్ ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో భాగస్వామ్యులయ్యారు.
ఖండాలు దాటిన ఘనత..
ఈ ఉద్యమం రాష్ట్రానికో, దేశానికో మాత్రమే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIలను సైతం కదిలించింది. వాళ్లు మొక్కలు నాటడం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం చేశారు. ఇది ఒక చైన్‌లా నిరంతరం జరిగే ప్రక్రియ అయిపోయింది. స్పెషల్ డేస్ పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా వాళ్ల జీవితంలో ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేకంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం నయా ట్రెండ్ అయింది.
సీఎం కేసీఆర్ మంత్రి, మంత్రి కేటీఆర్ నిరంతరం మద్దతు ఇవ్వడం, సమాజానికి ఏదైనా అందించాలనే స్వయం ప్రతిపత్తి వల్ల హరితయాత్రలో ఇంతవరకూ ఎలాంటి అవరోధాలు, సవాళ్లు ఎదురుకాలేదని సంతోష్ తెలిపారు.. ప్రభుత్వాలు చాలా విషయాల్లో ప్రశంసనీయమైన పని చేస్తున్నాయి, అయితే పౌరులుగా మనం కూడా ఇందులో పెద్ద మార్పును తీసుకురాగలము, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇందుకు అద్భుతమైన ఉదాహరణ అని ఎంపీ తెలిపారు.
దత్తత తీసుకున్న ఫారెస్ట్ బ్లాక్‌లు
MP సంతోష్ కేవలం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే డ్రైవ్‌ను పరిమితం చేయకుండా GIC యొక్క “హర హై తో, భారా హై” నినాదంతో ముందుకెళ్లారు. 2019లో 2,042 ఎకరాల కీసర ఫారెస్ట్ బ్లాక్‌ని దత్తత తీసుకుని, ఇందుకోసం తన ఎంపీ నిధులు, సొంత జేబు నుంచి రూ.3 కోట్లు కేటాయించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అతని పిలుపు మేరకు “బాహుబలి” ఫేమ్ ప్రభాస్ కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను 1,650 ఎకరాలను దత్తత తీసుకున్నాడు, ఆ తర్వాత అక్కినేని నాగార్జున 1,100 ఎకరాల చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్‌ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ చైర్మన్ & ఎండీ బి. పార్థసారధి రెడ్డి కూడా సంగారెడ్డి జిల్లాలోని ముంబాపూర్-నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 2,543 ఎకరాలను దత్తత తీసుకుని తొలి గ్రాంట్‌గా రూ.5 కోట్లు ఇచ్చారు.
ఇప్పటి వరకు నాలుగు ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తత తీసుకున్నామని త్వరలో ఈ జాబితాలోకి డి రామానాయుడు కుటుంబం నుండి దగ్గుబాటి సురేష్ బాబుకు భాగస్వామ్యం అవుతారని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.. తెలంగాణలో కనిష్టంగా 200 ఎకరాలతో ప్రారంభించి దాదాపు 80కి పైగా ఫారెస్ట్ క్లస్టర్లు ఉన్నాయని, వాటిని దత్తత తీసుకుని పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్దఎత్తున అడవుల పెంపకం చేపట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
సాధారణంగా ఏ పని అయినా మొదలుపెడితే.. అందులో పాజిటివ్‌ను, నెగిటివ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి. కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటివరకూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, ఆటుపోట్లు, ఒత్తిడిని తాను ఎదుర్కోలేదని ఎంపీ సంతోష్ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో తన భాద్యత మరింత పెరిగిందని, స్థాలాలు, పరిసరాలు పచ్చగా మార్చడం మెరుగైన జీవన నాణ్యత కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడమే తన అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలి..
ఈ ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలో అందరికీ ఇప్పటికే బాగా తెలిసి ఉంటుంది. అయినా తెలియని వాళ్లకోసం ఒకసారి మళ్లీ చూడండి..
మీ ఇల్లు, పార్క్ లేదా ఓపెన్ స్పేస్, ఆఫీస్, రెసిడెన్షియల్ ఏరియా లేదా కాలనీ ప్రాంగణంలో కేవలం 3 మొక్కలు నాటండి.
మీ సెల్ఫీలను 90003 65000కు వాట్సాప్ చేయండి. వెంటనే మీరు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా రిప్లైయ్ వస్తుంది.
ఆ తర్వాత యాప్‌లో మీ సెల్ఫీలను అప్‌లోడ్ చేయండి.
అంతే.. GIC బృందం వాటిని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు వారి గ్రూప్‌లలో విస్తృతంగా షేర్ చేస్తుంది.
మీరు కూడా మరో సన్నిహితుల్లో ముగ్గురిని ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా మీ సోషల్ మీడియా ఖాతాలో వారిని ట్యాగ్ చేస్తూ మీ సెల్ఫీ ఫోటోలు పోస్ట్ చేయాలి.