వైరల్: తెలంగాణకు బీహార్ కు తేడాలేదా?

-

గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రిలో వరద నీరు పొంగడం.. ఆ నీటిమధ్యే మంచాలు.. ఆ మంచాలపై కదలలేని స్థితిలో రోగులు.. అదే బురద నీటిలో వైద్యులు – వైద్య సిబ్బంది సేవలు.. అదే మురికి నీటిలో కరోనా కిట్ లు తేలియాడటాలు… వీటన్నింటికీ వేదికైంది ఉస్మానియా ఆసుపత్రి! ఈ క్రమంలో ఈ వ్యవహారం అమిత్ షా వరకూ చేరింది వయా బీహార్!

అవును… ఉస్మానియా అసుపత్రిలోని దౌర్భాగ్యకర పరిస్థితులకు అద్దపట్టేలా తాజాగా జరిగిన సంఘటనకు సంబందించిన ఫోటోలు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో…ఈ పరిస్థితి బీహార్ లోనే అనుకొన్న ఒక్ బీహారి వ్యక్తి… తమ రాష్ట్రంలో వరద పరిస్థితి దారుణంగా ఉందని.. కరోనా రోగులు చికిత్స అందక చనిపోతున్నారని.. జోక్యం చేసుకోవాలంటూ ఉస్మానియా ఆస్పత్రి ఫొటోను ఏకంగా కేంద్ర హొంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేసి పోస్ట్ చేసి కోరాడు. దీంతో బీహార్ లో ఇంత దారుణంగా ఉందా అంటూ ఆ ఫొటో వైరల్ అయ్యింది.

కేంద్ర హోం మంత్రి వరకూ వెళ్లడంతో ఈ వ్యవహారంపై జాతీయ మీడియా చానల్స్ దృష్టి పెట్టాయి… విషయం ఎక్కడ ఏమిటి అని ఆరాతీసాయి! ఫలితంగా ఆ ఫోటో బీహార్ ది కాదని, తెలంగాణదని తేలింది. ఎందుకంటే… తెలంగాణలో లాగానే బీహార్ లో కూడా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు ఫలితంగా వరదలూ వచ్చాయి. ఇదే సమయంలో కరోనా కూడా బీహార్ లో బాగా ప్రబలుతోంది. ఈ నేపథ్యంలోనే అది బీహార్ లోనిదేనని భ్రమపడ్డ ఆ రాష్ట్ర నెటిజన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశాడని కనిపెట్టాయి.

అనంతరం… ఇది బీహార్ కాదు నాయనా… హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి అని అతడికి వివరణ ఇవ్వడంతో ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అంటే… ఆ నెటిజన్ దృష్టిలో తెలంగాణకు – బీహార్ కు తేడా లేదన్న మాట! ఆ ఫోటో కూడా అలా ఉందిలే!!

Read more RELATED
Recommended to you

Latest news