Home వార్తలు Telangana - తెలంగాణ రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఇవాళ డ్రా చేయలేకపోయామన్నారు. కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జనరేటర్‌, డిస్కంలకు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ఉంటుందని, ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చని సీఎండీ పేర్కొన్నారు.

రానున్న ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు.  ‘పాత బకాయిలు రూ.1360 కోట్లు చెల్లించినా, కరెంటు కొనకుండా ఆపడం బాధాకరం. దీనిపై శుక్రవారం సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం సూచించారు. జలవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. కొరత రాకుండా చూస్తున్నాం. శుక్రవారం రాష్ట్రంలో 12,214 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. కోతలు విధించలేదు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు సరఫరాలో అంతరాయం ఏర్పడినా రైతులు, ప్రజలు సహకరించాలి’ అని ప్రభాకర్‌రావు కోరారు.