ఆగస్టు 14నే మూడో విడుత రుణమాఫీ ఉంటుందని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. రైతుల పేరిట బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని తెలిపారు. రుణమాఫీ కానీ రైతులు ఆఫీసర్లకు వివరాలు ఇస్తే.. తప్పకుండా రుణమాఫీ అవుతుందని మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న తెలంగాణకు చేరుకోగానే ఆరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడుత రుణమాఫీ కార్యక్రమం చేపించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు.
రైతాంగ మనోధైర్యాన్ని దెబ్బతీయ వద్దు. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలను పరిగణనలోకి తీసుకున్నాం. పాస్ బుక్ లేకపోయినా వైట్ రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకున్నాం. ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాము. గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలి.