కారు’ని ముంచెత్తిన వరద ? గ్రేటర్ లో గిలగిల ?

-

తెలంగాణలో తమకు ఎదురు లేదని భావిస్తూ వచ్చిన అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ కు వరుసగా అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయినా , కెసిఆర్ తన రాజకీయ చాణిక్య తో ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పైచేయి సాధించే విధంగా కెసిఆర్ రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు.తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ జండా రెపరెపలాడే విధంగా కెసిఆర్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వస్తున్నారు. ఆ ధీమాతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతామని,  మేయర్ పీఠాన్ని దక్కించుకుంటా ము అనే ధీమాతో ఉంటూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల కారణంగా , మొత్తం పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి.
వేల కోట్లు కుమ్మరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్న టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టే విధంగా , అభివృద్ధి మొత్తం కొట్టుకుపోగా, వరదలు మిగిల్చిన బురద మాత్రమే మిగిలింది. అంతేకాకుండా, ప్రభుత్వ ముందుచూపు కొరవడడం తోనే నగరంలో ఇంతటి పెను విపత్తు సంభవించిందని ప్రజలంతా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఇప్పుడు తిరగబడుతున్నారు. సుమారు పదివేల వరకు వరద సహాయం ప్రకటించినా, ప్రజల్లో మాత్రం అసంతృప్తి తగ్గలేదు.
అంతేకాకుండా ఈ వరద సహాయంలో అవినీతి జరిగిందంటూ, కార్పొరేటర్ల ఇళ్ల ముందు ధర్నాలు చేసే వరకు పరిస్థితి రావడం వంటి వ్యవహారాలతో టిఆర్ఎస్ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతోంది . ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికలు నిర్వహిస్తే , ప్రజాగ్రహం చవిచూడక తప్పదని, ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయడమే సరైన మార్గం అంటూ టిఆర్ఎస్ శ్రేణులు నుంచి అధినేత కేసీఆర్  ఒత్తిడి పెరుగుతుండడంతో, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా ప్రజలంతా కుదుటపడి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదనే  అభిప్రాయం లో టిఆర్ఎస్ నాయకులు ఉండగా,  ఈ విషయంపై ఇప్పటి వరకు కెసిఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ , దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతుండటంతో,  గ్రేటర్ ఎన్నికలపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. అయితే మిగతా పార్టీలు మాత్రం ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే తమకు కలిసొస్తుందనే అభిప్రాయంలో ఉన్నాయి. ఏది ఏమైనా గ్రేటర్లో పరిస్థితులు ఈ రకంగా మారుతాయని టిఆర్ఎస్ ఊహించలేకపోయింది. అందుకే నవంబరు జరగాల్సిన ఎన్నికలను కాస్త వచ్చే ఏడాదికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news