గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్ వన్‌సైడ్ అయిపోతోంది. సాధారణ ఎన్నికలు కావొచ్చు.. స్థానిక సంస్థల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఏం జరిగినా కారు జోరుకు తిరుగులేదు.. టీఆర్ఎస్కు ఎదురులేదన్నట్టుగా ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణలో అన్ని ఎన్నికలు ముగిశాయి. టీఆర్ఎస్ వన్‌సైడ్‌గా స్వీప్ చేసేసింది. అయితే మరో మూడు కీలక స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రానున్నాయి.
వచ్చే సంక్రాంతి తర్వాత ఈ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటి పదవీకాలం రద్దయితే కాస్త ముందుగానే ఎన్నికలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. అధికార పార్టీ మూడు చోట్లా గులాబీ జెండా ఎగరవేయాలన్న ఉద్దేశంతో మూడు పట్టణాల్లోనూ అభివృద్ధి పనుల జోరు పెంచింది. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రిగా ఉన్నారు. అక్కడ అభివృద్ధి జరుగుతున్నా గ్రూపు తగాదాలు అధికార పార్టీకి మైనస్‌గా మారాయి. మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల వర్గాల మధ్య సఖ్యత లేదు.
ఇక గ్రేటర్ వరంగల్లోనూ కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి చేస్తున్నా ఇక్కడ కూడా గ్రూపు తగాదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి ఆధిపత్యం పెరుగుతుండడంతో ప్రభుత్వ చీప్‌విప్ వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అసహనంతో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ వేడి తగిలేలా స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీనికి తోడు వరదలు రావడం.. ప్రభుత్వ యంత్రాగం సరైన చర్యలు సకాలంలో తీసుకోవడంలో విపలమవ్వడంతో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక కార్పొరేట్లకు ఎమ్మెల్యేలకు మధ్య పొసగని పరిస్థితి ఉంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పైకి బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా అది పాల పొంగేనట. ఈ విషయం కేటీఆర్ చేయించిన సర్వేలోనే తేలింది. దీనికి తోడు అభివృద్ధి కొన్ని చోట్ల జరుగుతున్నా మురికివాడలు అలాగే ఉంటున్నాయి. ప్రధాన రహదారుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లను రాజకీయంగా ఇబ్బంది పెడుతుండడంతో ఆ ప్రభావం పార్టీ కేడర్‌పై పడుతోంది. ఇక గ్రేటర్లో ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో టీఆర్ ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి, మెదక్ జిల్లాలో పరిధిలోని జీహెచ్ ఎంసీ డివిజన్లలో కూడా కొంత ఇబ్బందే ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుపు అంత సులువు కాదన్నది మాత్రం వాస్తవం.