కొన్ని రోజుల నుంచి జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ నౌషారా ప్రాంతంలోని నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి ఆ నది మధ్య భాగంలో చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. అతన్ని రక్షించటానికి ఎంతో ప్రయత్నం చేశారు అధికారులు. కానీ సమయం గడిచే కొద్ది నది ప్రవాహం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు అధికారులు భారత సైన్యం సహాయం కోరింది.
అధికారుల విజ్ఞప్తి మేరకు భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్ సాయంతో అధికారి గణేశ్ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం… ఘటనా స్థలికి చేరుకున్నారు. హెలికాఫ్టర్‌ను ముందుగా ల్యాండ్ చేయటానికి ప్రయత్నించారు. నదీ ప్రవాహం కారణంగా వారికి అనువైన ప్రదేశం కనిపించలేదు. దీంతో హెలికాఫ్టర్‌ను గాలిలోనే బాధితుడికి చేరువలో ఉంచి.. ఇద్దరు ప్రత్యేక బృంద సభ్యులు తాడు సాయంతో కిందకు దిగారు. అనంతరం అతడిని అదే తాడుతో పైకి ఎక్కించి నౌషారా ప్రాంతంలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అధికారులు.