నేటితో ముగియనున్న రాత్రి కర్ఫ్యూ… నెక్ట్స్ ఏంటీ..?

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ నేటితో ముగియనుంది. ఏప్రిల్ 20న ఈ రాత్రి కర్ఫ్యూ విధించగా… మే 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపిన విషయం తెల్సిందే. అయితే రాత్రి కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరువాత ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఎలా అని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సంకేతాలు అందుతున్నాయి. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో రానున్న మరో నాలుగు వారాలు అత్యంత కీలకమని రాష్ట్ర వైద్యాధికారులు ఇప్పటికే స్పష్టం చేసారు, ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూనే మరికొన్ని రోజులు పోడగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి నేడు సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే కరోనా కట్టడిపై కేంద్రం కూడా కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టు పలు రాష్ట్రాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.