టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిందితులు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్, రేణుక దంపతుల బ్యాంక్ స్టేట్‌మెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తోంది.
మంగళవారం రోజున కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మి నుంచి మరికొన్ని వివరాలు సేకరించిన సిట్.. ఆమె చెప్పిన వివరాలతో నేడు ప్రవీణ్‌ను విచారిస్తోంది. టీఎస్‌పీఎస్సీలోని మరికొంతమంది ఉద్యోగులకు కూడా నోటీసుల ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులతో సంప్రదింపులు జరిపిన వారి కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంట్.. ఇచట అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల క్వశ్చన్ పేపర్లు లభించును అని పోస్టర్లలో రాసి ఉంది.