హిందూ దేవుళ్లను అవమానించిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విజయశాంతి. తెలంగాణలో అన్ని మతాల్నీ సమానంగా చూస్తామంటూ డాంబికాలు పలికే కేసీఆర్ సర్కారు, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ….. రాజాసింగ్ గారి విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తూ దారుణమైన ఉల్లంఘనలకి పాల్పడటం కనిపిస్తోందని ఆగ్రహించారు.
రాజాసింగ్ గారి వీడియోపై ఒక వర్గం నుంచి నిరసన వ్యక్తం కాగానే ఆయన తన వీడియోని తొలగించారు. మరి హిందూ మతాన్ని కించపరిచే వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు తొలగించడం లేదు? ఆ వీడియోల్లో హిందూ దేవుళ్లని అవమానించిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేసి కేసులు పెట్టలేదు? అని నిలదీశారు.
రాజాసింగ్‌ని అరెస్ట్ చేయకపొతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ని తగులబెడతాం అన్న వారిని అరెస్ట్ చెయ్యకుండా ఈ సూడో సెక్యులర్ టీఆరెస్ సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. రాజాసింగ్ విధానపరంగా పార్టీ సస్పెన్షన్‌కి గురైనప్పటికీ తన వివరణ ఇచ్చే సందర్భంగా నడుస్తున్న పరిస్థితుల్లో.. ఎన్నికైన ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా ఆయన భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాల విశ్వాసాలనూ గౌరవిస్తూ, ప్రజలందరి మనోభావాలు, ప్రశాంతత విషయంలో ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా ఉండాలని తెలియజేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.