తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బును సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం పంపిస్తున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం బిఆర్ఎస్ కి లేదని.. రూ.100 కోట్లు ఇవ్వాలనుకుంటే అవి రాష్ట్ర రైతులకే ఇస్తామని అన్నారు.
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం ప్రతిపక్షాలు మానుకోవాలని హితవు పలికారు. ఓవైపు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు బాధలో ఉంటే గవర్నర్ తమిళి సై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ రాజకీయాలు చేయకపోతే ఆమెను గౌరవించే వారి మని అన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి రాజకీయం చేసే వారిని కలవరని చెప్పారు. రైతులు కష్టాలలో ఉంటే కేంద్ర బృందాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.