తెలంగాణకు వర్ష సూచన, నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉన్నట్టు పేర్కొంది.

రాష్ట్రంలో మొన్న ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. భద్రాద్రి జిల్లా అశ్వాపురం లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మంచిప్ప లో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అలాగే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరేడుమెట్ లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిహెచ్ఎంసి అధికారులు ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.