మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గలమెత్తడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ సమావేశంపై మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ.. తనకి మంత్రి కేటీఆర్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు. తాము సమావేశమయ్యే విషయం కూడా ఎవరికీ చెప్పలేదు అన్నారు మైనంపల్లి. ఎమ్మెల్యేలము కలవడం తప్పా? అని ప్రశ్నించారు. పార్టీ అంతర్గత విషయం అయినందువల్ల ఇంట్లో మాట్లాడుకున్నామని.. ఎవరో ఒకరు చెప్పకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి అన్నారు.
మంత్రి మల్లారెడ్డి అందరితో కలిసి మాట్లాడి నిర్ణయిస్తే.. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడిచే ఎమ్మెల్యేలు.. ఆయన ఆదేశాలు లేకుండా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అనే సందేహం రాజకీయ వర్గాలలో ఉత్పన్నమవుతోంది. మరి కెసిఆర్ కు తెలియకుండానే ఇదంతా జరిగితే ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.