రీతి మార్చుకోండి.. కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

హైదరాబాద్: వైఎస్ షర్మిల మాటల దూకుడు పెంచారు. వ్యాక్సినేషన్ల విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ‘తలాపున సముద్రం ఉన్నా చేప దూప కేడ్చినట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి’ అని ఆమె విమర్శలు చేశారు. వ్యాక్సిన్ తయారీ సెంటర్లు గీడనే ఉన్నా వ్యాక్సిన్ దొరకడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫస్ట్ డోస్ బంద్ పెట్టీ నెల రోజులు అయ్యిందని తెలిపారు. సర్కార్‌కి దొరకని వ్యాక్సిన్ ప్రైవేట్‌కి ఎలా దొరుకుతున్నాయని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ రీతి మార్చుకొని ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించాలని ఆమె సూచించారు. వ్యాక్సిన్ తేవడం‌ కేసీఆర్‌కు చేతకావడం లేదా? అని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ భారం తగ్గించుకొని కమీషన్ కోసం అధపడ్డట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.

కాగా వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్సార్‌టీపీగా పార్టీ పేరు ఖరారు చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా ఆమోదించాయి. జులైలో పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఇటీవల కాలంలో ఆమె పరామర్శించారు