తెలంగాణలోని గద్వాల్ జిల్లా జడ్పీచైర్మన్ సరిత ఎఫెక్ట్‌తో ఆ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. కొత్త జిల్లా ఏర్పాటుతో జడ్పీ చైర్మన్ పీఠం కోసం ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికే జడ్పీ చైర్మన్ పీఠం దక్కేలా పావులు కదపగా అధిష్టానం జోక్యం చేసుకుని ఆలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు జడ్పీటీసీ సరితకు జడ్పీచైర్మన్ పీఠం కట్టబెట్టింది. సరిత జడ్పీచైర్మన్ అయ్యాక ఆమె గద్వాల నియోజకవర్గంపై ఫోకస్ చేశారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సరితతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తుండడంతో పాటు ఆమెను ఏ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు. అయితే గద్వాలలో బలమైన బీసీ ఓటు బ్యాంకు ఉండడంతో సరిత ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్లాన్‌తో వెళుతున్నారు. రేపటి వేళ గద్వాల సీటును బీసీలకు ఇస్తే ఆ ఛాన్స్ వదులకోకూడదన్నదే ఆమె ప్లాన్. అందుకే ఆమె గద్వాలలో దూకుడు పెంచడంతో కృష్ణమోహన్ రెడ్డి ఎలెర్ట్ అయ్యి ఆమె దూకుడుకు చెక్ పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.
ఈ ఆధిపత్య రాజకీయాల నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోగా… అధిష్టానం కలిసి పనిచేయాలని సూచించింది. అయితే సరిత ఇప్పుడు ఆలంపూర్‌లో కూడా దూకుడుగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే అబ్రహంలో టెన్షన్ స్టార్ట్ అయ్యిందట. సరిత సొంత నియోజకవర్గం ఆలంపూర్ కావడంతో అక్కడ కూడా తనకంటూ ఓ వర్గం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్ రాజకీయాల్లో తనకు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు.
మొన్న దసరా ఉత్సవాల్లో జోగులాంబ అమ్మవారికి ముందుగా ఎమ్మెల్యే అబ్రహం పట్టు వస్త్రాలు సమర్పించి రాగా.. ఆ తర్వాత సరిత మళ్లీ వెళ్లి వస్త్రాలు సమర్పించి రావడం వివాదమైంది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఒకరు చేసిన పనులకే మరొకరు తర్వాత వెళ్లి ప్రారంభాలు చేయడం చేస్తున్నారు. ఏదేమైనా జడ్పీచైర్మన్ హోదాలో సరిత రెండు నియోజకవర్గాల్లోనూ దూకుడుగా ఉండడంతో ఈ ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు ఆమెకు ఛాన్స్ ఇవ్వకూడదని ఎలెర్ట్ అయ్యారు.